User:Sarath95
సోనాలి విష్ణు శింగాటే
మహారాష్ట్రకు చెందిన సోనాలి విష్ణు శింగాటే మహిళల ప్రొఫెషనల్ కబడ్డీ క్రీడాకారిణి. 27 మే, 1995లో జన్మించిన శింగాటే 2018 జకర్తా ఏషియా గేమ్స్‌లో రజతం, ఖట్మండు సౌత్ ఏషియన్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన భారత జట్టులో సభ్యురాలు.
భారత రైల్వేలో ఉద్యోగం చేస్తున్న సోనాలి జాతీయ కబడ్డీ చాంపియన్ షిప్‌లో రైల్వే జట్టుకు స్వర్ణ, రజత పతకాలను సాధించిపెట్టారు. కబడ్డీలో అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్న సోనాలిని మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అత్యున్నత క్రీడా పురస్కారం శివ్ ఛత్రపతి అవార్డుతో సత్కరించింది.[1]
వ్యక్తిగత జీవితం మరియు నేపథ్యం
సోనాలి ముంబైలోని లోయర్ పారెల్ లో జన్మించారు. ఆమె తండ్రి సెక్యూరిటీగార్డ్‌గా పనిచేయగా, తల్లి కేఫ్ నడిపేవారు. మహర్షి దయానంద్ కాలేజిలో చదువుతున్నప్పుడు కబడ్డీ ఆడటం ప్రారంభించారు సోనాలి. కోచ్ రాజేశ్ పడావే శిక్షణలో శివ్ శక్తి మహిళా సంఘ క్లబ్ తరఫున ఆమె శిక్షణ పొందారు. ఆ రోజుల్లో ఆమె ఆర్థికంగా ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నారు. కబడ్డీ ఆడేందుకు షూస్, కిట్ కొనుక్కునే తాహతు కూడా ఆమెకు లేకపోవడంతో, కోచ్ రాజేశ్ షూలను, కిట్‌ను ఇప్పించారు. ఓ వైపు కబడ్డీ ఆడేందుకు ఆమెను ప్రోత్సహిస్తూనే, మరోవైపు చదవుపై కూడా శ్రద్ధ వహించాలని సోనాలికి సూచించారు ఆమె తల్లిదండ్రులు. సాయంత్రం కబడ్డీ ప్రాక్టీస్ చేసి, అర్ధరాత్రి లేచి పరీక్షల కోసం సన్నద్ధమయ్యేవారు.[1]
కెరీర్ ఆరంభంలో శరీరాన్ని పటిష్ఠ పరిచేందుకు సోనాలి మరింతగా శ్రమించాల్సి వచ్చింది. పరుగెత్తడంలో చాలా సమస్యలు ఎదుర్కొన్న సోనాలి కాళ్లకు బరువులు కట్టుకుని పరిగెత్తి, వివిధ రకాల వ్యాయామాలను చేసి కాళ్లను, పొట్ట భాగాన్ని మరింత పటిష్ఠంగా మార్చుకున్నారు.[1]
పురుషులకు నిర్వహిస్తున్నట్టుగానే, మహిళలకు కూడా దేశవాళీ స్థాయిలో ప్రొ కబడ్డీ లీగ్ నిర్వహించాలని, అప్పుడే మహిళా క్రీడాకారిణులు దేశం తరఫున రాణిస్తారని సోనాలి అభిప్రాయపడుతున్నారు. [1]
ప్రొఫెషనల్ కెరీర్
జూనియర్ స్థాయిలో 2014లో మహారాష్ట్రకు ప్రాతినిథ్యం వహించడంతో సోనాలి కబడ్డీ కెరీర్ మొదలైంది. జూనియర్ నేషనల్ కబడ్డీ చాంపియన్ షిప్‌లో ఆమె మహారాష్ట్రకు కెప్టెన్ గా వ్యవహరించి, జట్టుకు రజత పతకాన్ని సాధించి పెట్టారు. 2015లో ఇండియన్ రైల్వేలో చేరిన సోనాలి 64వ (2016-17), 66వ(2018-19), 67వ (2019-20) సీనియర్ నేషనల్స్ లో జట్టుకు స్వర్ణాలను, 65వ (2017-18) సీనియర్ నేషనల్స్ లో రజతాన్ని అందించారు. [2]రైల్వే టీమ్ కీలక రైడర్ అయిన సోనాలి, జట్టుకు బోనస్ పాయింట్లు సాధించిపెట్టడంలో సిద్ధహస్తురాలు. జకర్తాలో 2018లో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో దేశం తరఫున ఆడేందుకు ఆమె ఎంపికయ్యారు. ఆ టోర్నీలో భారత జట్టు రజత పతకాన్ని గెల్చుకుంది. ఖట్మండులో 2019 సౌత్ ఏషియన్ గేమ్స్‌లో స్వర్ణాన్ని గెలిచిన భారత జట్టులో కూడా సోనాలి సభ్యురాలు.[2][3]
అవార్డులు
2020లో మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అత్యున్నత క్రీడా పురస్కారం శివ్ ఛత్రపతి అవార్డుతో సోనాలిని సత్కరించింది.