Jump to content

User:బెహరా ఉమామహేశ్వరరావు

From Wikipedia, the free encyclopedia

విద్యల నగరం గా భాసిల్లిన విజయనగరం జిల్లాలో ఎందరో సాహితీ మూర్తులకు నెలవైన పార్వతీపురం లో స్వస్తి శ్రీ వికృతి నామ సంవత్సర జ్యేష్ఠ శుక్ల నవమీ గురువారం నాడు 25-05-1950న సువర్ణమ్మ, సీతా రామ స్వాముల ద్వితీయ పుత్రునిగా జన్మించారు.


స్నాతకోత్తర విద్యనభ్యసించి, ఉపాధ్యాయ శిక్షణానంతరం తన కిష్టమైన ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించి, పార్వతీపురం మునిసిపాలిటీలోనే వివిధ పాఠశాలలో పని చేసారు .

హిందీలో రాష్ట్ర భాషా ప్రవీణ పట్టా కూడా పొందారు. 55వ సం.లో ఎమ్. ఇడీ కూడా చదివి, స్వంతుడు ఉత్తులయి ఆటలు ద్వితీయ శ్రేణి లో ఉత్తీర్ణులై, విద్యా దాహం తర్చుకున్నారు. పిల్లలతో మమేకమై, ఆటపాటలతో చదువు సంధ్యలు నేర్పి తను రచించిన బాలగేయాలు రాగయుక్తంగా పొడి పిల్లలతో పాడించేవారు. అదే క్రమంలో బాల సాహిత్యాన్ని ప్రవృత్తిగా చేపట్టి వెయ్యికి పైగా బాలల కథలు, గేయాలు, బాల సాహిత్య వ్యాసాలు ముసి అందించారు.

ప్రతికృతిని దిద్దే చిత్రకారులను, సరిగమలకు సరాగాలను పలికించే గాన గంధర్వులను, మహమ్మారి రోగాలనుండి రోగుల ప్రాణాలను కాపాడే వైద్యులను, దేశంకోసం ప్రాణాలను పణంగాపెట్టి పోరాడే వీర జవానులను, భాషకందని భావాలను సైతం తెనిగించే కవీశ్వరులను, నటనతో హావభావాలను ప్రదర్శించే నటులను, నృత్యంతో నటనా కౌశలాన్ని ప్రదర్శించే నాట్య కళాకారులను, రాకెట్లను కనుగొని, గ్రహాల ఉనికిని, వాటి చలనాలను పరీక్షించి, సృష్టికి ప్రతిసృష్టి చేసే శాస్త్రవేత్తలను దేశానికి అందిస్తున్న అపర విశ్వామిత్రుడు ..గురువు.


     ఉపాధ్యాయవృత్తికే వన్నె తెచ్చిన గురుతుల్యులు, 2007 సెప్టెంబరు5 న నాటి రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా సింగ్ పాటిల్ చేతులమీదుగా ప్రతిష్ఠాత్మక జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని స్వీకరించిన గురువరేణ్యులు, తెలుగు బాల సాహిత్య జగత్తులో ఉత్తరాంధ్రలో ఒక దీపకళిక - "శ్రీ బెహరా ఉమామహేశ్వరరావు". పిల్లలలో జ్ఞానకాంక్షని, ప్రకృతి పట్ల ఆసక్తిని, చదువుల పట్ల శ్రద్ధని, పెద్దలపట్ల గౌరవాన్ని కలిగించడానికి బాల సాహిత్యాన్ని అద్భుత సాధనంగా ఉపయోగించి, సఫలీకృతులైన ప్రముఖులలో ఈయన ఒకరు.

"జ్జానం దేహి స్మృతిం దేహి

విద్యాం విద్యాధి దేవతా

ప్రతిష్టాం కవితాం దేహి

శక్తిం శిష్య ప్రబోధికాం"

  ఓ తల్లీ!  విద్యకు అధి దేవత అయిన సరస్వతీ! నాకు జ్ఞానాన్ని ప్రసాదించు, జ్ఞాపకాన్ని ప్రసాదించు, విద్యనుఅనుగ్రహించు, ప్రతిష్ఠను, కవితా శక్తిని ప్రసాదించు, శిష్యులను జ్ఞానవంతులను చేసే శక్తినిఅనుగ్రహించు.. బ్రహ్మ వైవర్త పురాణం లోని ఈ శ్లోకం  ఈతని నిత్య పారాయణ పుస్తకంలోనేకాక, ఈతని మస్తకంలో నిక్షిప్తమైపోయింది. ఈయన ప్రసంగాలలో ముఖ్యంగా వినబడేవి -"గురువు కన్నబిడ్డలతో సమానంగా శిష్యులను ప్రేమించగలగాలి. చిన్నారులను ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దాల్సిన బాధ్యత గురువులదే.దైవభక్తి, దేశభక్తితో పాటు తాము బోధించే విషయాలపై చక్కటి పరిజ్ఞానం, శాస్త్రజ్ఞానం వుండాలి. దేశచరిత్ర, సంస్కృతి పిల్లలకు బోధిస్తూ వుండాలి. ఉపాధ్యాయుడు నిత్య విద్యార్ధి అన్న విషయాన్ని విస్మరించ కూడదు. పిల్లలమనస్సులు పెద్ద చెట్ల చుట్టూ అల్లుకునే లేత తీగల వంటివి. గురువులైనవారు ఆ లేత తీగలను సరియైన మార్గంలో అల్లుకునేట్లు చూడాలి.పిల్లలు సక్రమమైన మార్గంలో నడిస్తేనే దేశ భవిష్యత్తు బంగారు బాట కాగలదు" అని.

     అలాగే "విద్య ఒక ప్రవాహం, విద్య ఒక నిర్విరామ ఝరి, విద్య ఒక నిరాటంక వాహిని, విద్య జ్ఞానరూప ప్రకాశిక, విద్య ఒక మహార్ణవం, విద్య సకల ప్రజ్ఞల మయం, విద్యతోనే మానవుని జీవితం, అభివృద్ధి, ఎదుగుదల, సర్వం ముడిపడి ఉన్నాయి. చిన్నారులు విద్యయందు అభిలాష కలిగి, దిన దిన ప్రవర్ధనమానంగా పరిణతి  చెందుతూఉన్నత శిఖరాలను అధిరోహించడానికి విద్యార్థి దశలోనే అర్ధవంతమైన, పరిశీలనాత్మకమైన,సృజనాత్మకమైన,వ్యవహారాత్మకమైన, సమతుల్యమైన విద్యను అభ్యసించి, తెలివిని పెంపొందించుకోవాలి" అని అంటారు.

ప్రైవేటు పాఠశాలలో, ఉపాధ్యాయ వృత్తిలో రెండు దశాబ్దాలు దాటి సాగిన నా పయనంలో నేను ఆదర్శంగా తీసుకున్న వారిలో ప్రముఖులు శ్రీ బెహరా ఉమామహేశ్వరరావు.  ఏడు పదుల వయసు దాటినా, సాహితీ సేద్యం చేస్తూ, పాఠకులను అలరిస్తూ వస్తున్నారు. ఈతని రచన లేని దిన, వార, పక్ష, మాస పత్రికలు లేవంటే అతిశయోక్తి కాదు. ఒక గేయం వ్రాసినా, కథ వ్రాసినా, కవిత వ్రాసినా, గేయ కథ వ్రాసినా, వ్యాసం వ్రాసినా, బెహరా వారి కృతిలో ఆయనదైన వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. వాక్కులో, వాక్యంలో, శబ్దంలో, భావంలో, భావనంలో, భాషణంలో, భూషణంలో ఒక వైలక్ష్యం వెల్లివిరుస్తుంది.